27 Feb , 2023

సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం.. ఇప్పుడు ఈ పదం పంటల సాగులో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకాలం అధిక దిగుబడి ఆశతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడిన రైతులు దానివల్ల భూమి నిస్సారంగా మారడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవడం, పురుగుమందుల అవశేషాలున్న పంట ఉత్పత్తులను ఆహారంగా వినియోగిస్తూ ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని క్రమంగా గుర్తిస్తున్నారు. నెమ్మదిగా మళ్లీ సేంద్రియ సాగువైపు మళ్లుతున్నారు. దేశంలో ప్రస్తుతం 39.4 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. అందులో వ్యవసాయం చేస్తున్న భూమి 21.5 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో 66 లక్షల ఎకరాల్లో మాత్రమే సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ సాగు జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పూర్తి సాగు విస్తీర్ణంలో సేంద్రియ సాగు కేవలం 3.24 శాతమేనన్నమాట. అయినప్పటికీ గత కొన్నేళ్లతో పోలిస్తే సేంద్రియ సాగు దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయని అర్థమవుతోంది.